గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్ పేరు ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతోపాటు.. రాడిసన్ హోటల్‌లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు తెలిపారు. గజ్జెల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే, ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో డ్రగ్స్‌తో పార్టీలు (Drugs Party) చేసుకుంటున్న రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ అవినాశ్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో కొకైన్‌తో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హోటల్‌పై దాడిచేశారు. అప్పటికే ముఠా పరారు కావడంతో పార్టీ నిర్వాహకుడైన మంజీర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గజ్జల వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు చేశారు.
అక్కడాయనకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ వాడినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్, కేదార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం వేట ప్రారంభించారు. నిందితుల నుంచి కొకైన్ వాడిన కవర్లు, డ్రగ్స్‌కు ఉపయోగించిన పేపర్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద బీజేపీ నేత కొడుకు కాగా, కేదార్ అలియాస్ కేదార్‌నాథ్ పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. సినిమా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరి సెల్‌ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు ముందుగానే ఫోన్లలోని డాటాను డిలీట్ చేశారని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.