AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వర్సిటీల అభివృద్ధిపై త్వరలో వీసీలతో సమావేశం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని యూనివర్సిటీ(Universities) ల అభివృద్ధికి త్వరలోనే వైస్‌ చాన్స్‌లర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌, ఎమర్జింగ్‌ ఇష్యూస్‌, పాలసీ ఇంటర్వెన్షన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాస్పెక్ట్స్‌ ’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే 11 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌(DSC Notifications) విడుదల చేయనున్నామని వివరించారు. వచ్చే నెల 2న వివిధ విభాగాలకు చెందిన ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు.

రెవెన్యూశాఖ, ధరణి(Dharini) కి సంబంధించి రెండు లక్షల 45 వేల ఫిర్యాదులతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే నెల ఒకటో వారంలో వాటి పరిష్కారం ఉంటుందని తెలిపారు. దీనికి ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరాం, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌, ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, సదస్సు డైరెక్టర్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ చింత గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10