సింగరేణి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు వినిపించింది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ. కోటికి పెంచింది రేవంత్ ప్రభుత్వం. అయితే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమాను 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. సుమారు 43 వేల మంది కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకం వర్తించనుంది. అయితే.. ఇప్పటి వరకు కేవలం సైనికులకు మాత్రమే ప్రమాద బీమా కోటి రూపాయలు ఉండగా.. ఇక నుంచి సింగరేణి కార్మికులకు కూడా వర్తించనుంది.
ఈ మేరకు బ్యాంకర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. హైదరాబాద్ సచివాలయంతో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర క్రియాశీలకమన్నారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.