అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. వారి ఉపాధి కూడా పోతోందని అన్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు లేఖను రాశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2 లక్షల మంది యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. బీజేపీ సర్కార్ సాయుధ దళాల్లో నియామకాల్ని మరింత కఠినతరం చేసిందన్నారు. దీనికితోడు తాత్కాలికంగా రిక్రూట్‌మెంట్ చేసుకోవడం యువత భవిష్యత్తును అంధకారంలో పడేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత తమ కల సాకారం అవుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని, ప్రధాని మోడీ తీసుకొచ్చిన అగ్నిపథ్‌తో యువతలో నిరాశ పెరిగిపోయిందని అన్నారు. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని, వారికి కూడా న్యాయం జరగాలని లేఖలో డిమాండ్ చేశారు.
సాయుధ దళాల్లో ఎంపికైన వారిని ఈ మధ్య కలిశానని తెలిపారు. ప్రభుత్వ చర్యతో దేశ సేవ చేసేందుకు వారు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-22 మధ్యకాలంలో దాదాపు 2 లక్షల మంది త్రివిధ దళాల్లో చేరారని, ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి వారు కొలువులు సంపాదించారని అన్నారు. జాయినింగ్ లెటర్‌ల కోసం ఎదురు చూశారని, వారి ఆశలను సమాధి చేస్తూ ప్రభుత్వం అగ్నిపథ్ పథకంతో నియామకాలను చేపట్టాలని నిర్ణయించిందని లేఖలో చెప్పుకొచ్చారు. ఈ పథకం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఒక పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. ఈ పథకం వివక్షతో కూడినదని, దీని కింద నియమితులైన వారికి 4 సంవత్సరాలే ఉద్యోగం కల్పించి తరువాత ఉద్యోగం నుంచి తీసేస్తే దేశ వ్యాప్తంగా నిరుద్యోగిత రేటు పెరిగిపోతుందని మల్లికార్జున ఖర్గే లేఖలో పేర్కొన్నారు.