మాజీ మంత్రి కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావని అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ముందే ప్రకటిస్తే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా గెలిచే వారు కాదని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కావడం వల్లే.. అప్పటి సీఎం కేసీఆర్‌పై పోటీ చేశారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పుతారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా పాలన అందిస్తుంది సీఎం రేవంత్ మాత్రమేనన్నారు. కేటీఆర్, కవిత మాదిరి పేమెంట్ సీటు రేవంత్ రెడ్డిది కాదు, ఆయన రైతు బిడ్డ అని చెప్పారు. పాలమూరుకు జాతీయ హోదా అడగలేదని, పనికిరాని, ఆచరణకు సాధ్యం కానీ కాళేశ్వరం కట్టి రూ. వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు పట్టం కట్టడం ఖాయమని, త్వరలో మరో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చేసేందుకు సిద్ధమయ్యామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.