బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండో విడత ప్రజాహిత యాత్రలో సంజయ్ పాల్గొన్నారు. తొలత కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను అరెస్టు చేస్తామని ఎప్పుడు అనలేదని, తప్పుచేసిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీకి బీజేపీకి సంబంధం లేదన్నారు. వాటిని శాసించే అధికారం తమ పార్టీకి గానీ, కేంద్రానికి గానీ లేవుని, అవి స్వతంత్ర సంస్థలని అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటాయని, గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే అంటూ చెప్పారు. తాము ఎవరితో కలవలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారని తెలిపారు.
ఇద్దరు కలిసే మోడీని ఓడించడానికి, రాష్ట్రపతిని ఓడించేందుకు ప్రయత్నించారని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రచారమే చేశారని మండిపడ్డారు. ఐదారు రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని ఎంపీ సీట్లుకు బీజేపీ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించబోతుందని, ఇంకా పొత్తెక్కడిదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు కరీంనగర్‌లో మూడో స్థానం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన కరీంనగర్‌కు ఏం చేశాడని ప్రశ్నించారు. కనీసం పార్టీ క్యాడర్‌ను కూడా గుర్తుపట్టడని, ఆయనే పోటీకి వెనకాముందు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి నా మీద గెలుస్తాడా? అని నిలదీశారు. దేశ, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలను ప్రజాహిత యాత్రలో ప్రస్తావిస్తామని, వేములవాడ, కొండగట్టు అభివృద్ధికి రాష్ట్రం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన వంతుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత నాదే అంటూ బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయని, వీటిల్లో హైదరాబాద్ సహా 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామరాజ్యం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, మోడీని గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.