రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో తన రెండో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇటీవల దక్షిణాప్రికా పై టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది. మూడు మ్యాచుల్లో గెలవగా ఓ మ్యాచ్లో ఓడిపోయింది. 75 విజయశాతంతో పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే.. రాంచీ టెస్టుతో కలిపి ఎనిమిది మ్యాచులు ఆడింది. ఇందులో ఐదు మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడగా ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. 64.58 విజయశాతంతో రెండో స్థానంలో ఉంది.
ఇక ఆస్ట్రేలియా 10 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఓడింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. 55 విజయశాతంతో మూడో స్థానంలో ఉంది. ఆ తరువాత బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), దక్షిణాఫ్రికా (25) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి.
భారత్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ రాంచీలో ఓడిపోవడంతో 19.44 విజయశాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ సైకిల్లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది.









