AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నింగిలో భారీ నిఘా నేత్రం.. రోదసిలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్న ‘అల్బెడో’

రోదసిలోకి శక్తివంతమైన ఉపగ్రహం
వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న ‘అల్బెడో’
ప్రపంచంలో ఎవరిపైన అయినా జూమ్‌
వాషింగ్టన్‌ : రోదసి నుంచి ప్రపంచంలో ఎవరిపైన అయినా, ఎక్కడున్నా తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. అమెరికా స్టార్టప్‌ ‘అల్బెడో’ రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎంతో నాణ్యమైన ఉపగ్రహమని, నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు, ప్రాంతాలపై నిశితంగా దృష్టి సారించగలదని (జూమ్‌ చేయగలదని) నిపుణులు చెప్తున్నారు. దీన్ని నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని, ఓ ‘బిగ్‌ బ్రదర్‌’ నిత్యం మనల్ని, మన కదలికలను సునిశితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని ‘అంతరిక్షంలో ఉండే భారీ కెమెరా’గా ఎలక్ట్రానిక్‌ ఫ్రాంటియర్‌ ఫౌండేషన్‌ జనరల్‌ కౌన్సెల్‌ జెన్నిఫర్‌ లించ్‌ అభివర్ణించారు. మనకు తెలియకుండా దీన్ని ఏ ప్రభుత్వమైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికకు తెలిపారు.

అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే (ఫేసియల్‌ రికగ్నిషన్‌) సాఫ్ట్‌వేర్‌ ఈ ఉపగ్రహంలో ఉండదని ‘అల్బెడో’ చెప్తున్నప్పటికీ.. ఇది వ్యక్తులను చిత్రీకరించదని గానీ లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని గానీ భరోసా ఇవ్వడం లేదు. జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడంలో అమెరికా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ‘అల్బెడో’ ఇప్పటికే యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌తోపాటు నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌తో లక్షల డాలర్ల విలువైన రెండు భారీ ఒప్పందాలను కుదుర్చుకున్నది.

ANN TOP 10