క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను కలవాలని భారతదేశంలోని ప్రతి యువ క్రికెటర్, అభిమానులు కలలు కంటారు . అయితే ఈ కలను సాకారం చేసుకోవడంలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అయితే సచిన్ స్వయంగా ఓ అభిమానిని కలవాలనుకున్న అరుదైన సందర్భం ఇది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన దివ్యాంగ (పారా) క్రికెటర్ అమీర్ హుస్సేన్ అలాంటి అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న అమీర్ హుస్సేన్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో సచిన్ పేరు, 10వ నంబర్‌తో కూడిన టీమిండియా జెర్సీని ధరించి మెడలో బ్యాట్‌తో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు అమీర్. షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌పై అమీర్ కున్న ఆసక్తికి, అభిరుచికి అందరూ ఫిదా అయ్యారు. ఈ వైరల్ వీడియో చూసిన సచిన్ టెండూల్కర్ కూడా అమీర్‌ను కలవాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్, అమీర్, అతని కుటుంబ సభ్యులను కలిశాడు. ఈ సందర్భంగా అమీర్ సచిన్‌కి తాను ఎంత పెద్ద అభిమానినో వివరించాడు అమిర్. అలాగే రెండు చేతులు లేకుండా క్రికెట్ ఎలా ఆడతాడో కూడా మాస్టర్ బ్లాస్టర్ కు చూపించాడు.
అమీర్ సాధించిన ఘనత గురించి సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. 8 ఏళ్ల వయసులో ప్రమాదం కారణంగా అమీర్ తన రెండు చేతులను కోల్పోయాడని చెప్పాడు. అయితే ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత అమీర్ తన కలను సాకారం చేసుకుని ఇదంతా సాధించడం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఇది విన్న అమీర్ భావోద్వేగానికి గురయ్యాడు.









