మెదక్ జిల్లా తూప్రాన్ లో ఇవాళ నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ… తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 స్థానాలు బీజేపీ గెలవడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా ఓడిస్తామని అన్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా ఆ ఓటు వృథా అయినట్టేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.