రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతమైంది. ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం జాతర.. నేటితో పరిసమాప్తమవుతుంది. గద్దెపైకి చేరుకున్న సమ్మక్క, సారలమ్మ ఇవాళ సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. చిలకల గట్టుకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగియనుంది. నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర ముగియనుండడంతో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది మేడారం వనదేవతలను దర్శించుకున్నారని వెల్లడించారు.
నిన్నటి వరకు 10 వేల బస్ ట్రిప్పులు నడిచాయని అన్నారు. గుండె సమస్యతో వృద్ధురాలు, మరో యువతి జాతరలో మృత్యువాత పడ్డారని, మద్యం సేవించి జంపన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందని, వనప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పారు. రేపటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని ఆదేశించారు. 4 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారని, జాతరకు నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కేబినెట్ మంత్రులకు, సహకరించిన భక్తులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.