యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని, పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రుల బృందం శనివారం పవర్ ప్లాంట్ ని సందర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కలిసి బేగంపేట నుండి హెలికాప్టర్లో వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి వెళ్లారు. వీరికి సీఎం కలెక్టర్ హరిచంద్ర ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ఈ సందర్శనలో భాగంగా ప్లాంట్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులపై దృష్టి సారించాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
ప్రాజెక్టు పనులకు సంబంధించి నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అవకతవకలు, ఇంకా ఎంత మందికి పరిహారం అందాల్సి ఉందని మంత్రులు ఆరా తీశారు. మరోవైపు 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేసే 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లలో ఈ ఏడాది చివరి నాటికి రెండు యూనిట్లను అందుబాటులోకి తెస్తామని జెన్కో సీఎండీ రిజ్వీ ప్రకటించారు.