అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra Babu) నాయుడుపై విరుచుకుపడ్డారు. పేదలకోసమే పనిచేస్తున్న ప్రభుత్వంపై కేసుల పేరుతో అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాబు వల్లే ఏపీలో రాజకీయాలు (Politics) భ్రష్టు పట్టాయని ధ్వజమెత్తారు.
వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే ఆయన దుర్మార్గమే ఎక్కువనని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు బైబై చెబుతున్నారని , ఈ సారి కుప్పం (Kuppam) లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తాను దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదని, ప్రజలే తనకు దేవుళ్లని అన్నారు. టీడీపీ (TDP) పాలన పేదలకు సెంట్ స్థలం కూడా ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు.
పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని, ఇంటింటికీ తలుపు తట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమని అంటున్నారని విమర్శించారు.