మేడారం సమక్క – సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై, అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు.
ఇది గొప్ప జాతర: గవర్నర్
దర్శనానంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరానని తెలిపారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. నేను గవర్నర్‌గా మూడోసారి మేడారం జాతరకు రావడం నా అదృష్టం అని గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు.
ఆనందంగా ఉంది: అర్జున్ ముండా
ఇది దేశంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర అని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు.
వైభవంగా….
ఇదిలా ఉండగా, సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర ప్రాంగణం మార్మోగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే గద్దెలపైకి సమక్క సారలమ్మలు చేరుకోవడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 21 నుంచి జాతర ప్రారంభమవగా.. నాలుగు రోజుల పాటు వనదేవతల జాతర జరుగనుంది. తిరిగి అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగియనుంది.