ఖమ్మం: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. తాజా ఖమ్మంలో ఆ పార్టీ భారీ షాక్ తగిలింది. నలుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. పాలెపు విజయ(44వ డివిజన్), ఆళ్ల నిరిష (21వ డివిజన్), రాపర్తి శరత్ (50వ డివిజన్), మాడురి ప్రసాద్ (39వ డివిజన్) గులాబీ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఖమ్మంలో అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్‌ను నలుగురు కార్పొరేటర్లు వీడిపోవడం ఎదురుదెబ్బగా భావించాలని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని వలసలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.
తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అరాచకం, అవినీతి, భూ కబ్జాలు లేని ఖమ్మం కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. ప్రశాంతమైన అభివృద్ధి కోసమే ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో చేరుతున్న నాయకులు పాత కొత్త వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయాలని తుమ్మల కోరారు. ‘‘నా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.