సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్న సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం 7 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఉన్న 100 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఆయిల్‌తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాదాపు 6 గంటల వరకు మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలం వద్ద జనం భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్‌స్టేషన్ లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సుమారు రూ.4కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దీంతో సిద్దిపేట నియోజకవర్గ గ్రామాలతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు అర్ధరాత్రి వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.
నిర్లక్ష్యమే కారణమా?
సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం వెనుక విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నదా? అంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలిన ట్రాన్స్‌ఫార్మర్ 1997లో సబ్‌స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేసినప్పటిదని, పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇన్ని రోజులు ఎందుకు కొనసాగించారని ప్రశ్నిస్తున్నారు.
సంఘటనా స్థలానికి హరీశ్‌రావు
అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. మార్గంమధ్యలోనే విద్యుత్‌శాఖ అధికారులతో ప్రమాదంపై చర్చించారు. దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ ఫైర్‌స్టేషన్లకు ఫోన్ చేసి ఫైర్ ఇంజన్లను వెంటనే సంఘటనా స్థలానికి పంపించాలని కోరారు. విద్యుత్ శాఖ మంత్రి విక్రమార్కకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనా స్థలానికి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సహా చేరుకొని దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఫైర్ ఇంజన్‌లో నీళ్లు తగ్గినా కొద్దీ మున్సిపాలిటీ ట్యాంకర్లతో తెప్పించి ఫైర్‌ఇంజన్‌లో నింపించి మంటలు అదుపు చేయించారు. మంటలు తగ్గుముఖం పట్టిన తర్వాతనే సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.
అంధకారంలో సిద్దిపేట
సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో సిద్దిపేట పట్టణం పూర్తిగా అంధకాంలో ఉండిపోయింది. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. వ్యాపారులు ఏడు గంటలకే దుకాణాలు మూసేశారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, లాప్‌ట్యా్‌పలు చార్జింగ్ లేక మూగబోయాయి.