AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్ సభ ఎన్నికల సర్వే… కాంగ్రెస్‌దే హవా..ఎన్ని సీట్లంటే!

మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వస్తామని ఎన్డీయే ప్రభుత్వం ధీమాలో ఉండగా, ఈసారి కచ్చితంగా తమదే అధికారమని ఇండియా కూటమి నమ్మకంగా ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ప్రీపోల్ సర్వేలు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో పీపుల్స్‌ పల్స్‌ – సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ అనే సంస్థ కూడా సర్వే నిర్వహించింది. ఇటీవలే టైమ్స్‌నౌ, ఇండియా టుడేతోపాటు మరికొన్ని సంస్థలు కూడా సర్వే చేసిన విషయం తెలిసిందే.

పీపుల్స్ పల్స్ – సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ 10 గెలుచుకుంటుంది. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకున్న భారత రాష్ట్ర సమితికి ఈసారి మూడు నుంచి 5 మాత్రమే దక్కనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ సీటు ఎప్పటిలానే ఎంఐఎం ఖాతాలోకి వెళుతుందని చెప్పింది.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారని సంస్థ తన సర్వేలో వెల్లడించింది. అధికార పార్టీ కావడంతో ఆ బలం బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం, ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన అంశాలుగా మారినట్లు ఈ సర్వేలో వెల్లడించింది. మార్చి నుంచి అమలు చేయబోతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతోపాటు రూ.500 సిలిండర్ పథకం కూడా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా కలిసిరానున్నట్లు తేల్చింది. కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలనే భావన తెలంగాణలో కూడా గట్టిగా ఉందని, బీఆర్ఎస్ కు మాత్రం ఎటువంటి ట్యాగ్ లైన్ కనపడటంలేదని సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ అభిప్రాయపడింది. ఈ సర్వేను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బీజేపీకి 23 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు రానున్నట్లు వివరించింది. ముస్లిం ఓటుబ్యాంకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మళ్లుతుందని సంస్థ వెల్లడించింది.

ANN TOP 10