ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిక్కులు వదలడం లేదు. ఒక చిక్కు తొలగిపోయిందని అనుకున్న క్రమంలో మరో చిక్కు వచ్చి పడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి నోటీసులు అందాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను సీబీఐ కేసులు వేరు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది. ఆ విచారణను తనను పిలవొద్దని సుప్రీంకోర్టులో గతంలో కవిత పిటిషన్ వేశారు. నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే మరోసారి ఇప్పుడు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆమెను ఈ నెల 26 న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో ఆదేశించింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కవిత నిర్ణయంపై సస్సెన్స్
ఇప్పుడు అందిన నోటీసులతో బీఆర్‌ఎస్ పార్టీలోనూ అలజడి రేగింది. మూడుసార్లు కవితను ఈడీ విచారించింది. నాలుగోసారి విచారణకు రావాలని నోటీసులు రావడంతో సుప్రీంను ఆశ్రయించారు. తమను విచారణ పిలవొద్దని, తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై గత కొద్ది నెలలుగా విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. అయితే ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సీబీఐ పేర్కొంది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారు. బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. ఎమ్మెల్సీ కవిత తప్ప సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్లుగా అయ్యారు. అలా అప్రూవర్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారు. తాజాగా కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆరు సార్లు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం!
ఈ కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఆరు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికి ఆయనకు 6 సార్లు ఆయనకు నోటీసులు పంపించారు. అయితే.. ఇదంతా ఎన్నికలకు ముందు ఉద్దేశ పూర్వకంగా తమను ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతోనే మోడీ సర్కారు ఇలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ సమన్లు జారీపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతానని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో కవిత కూడా ఇలానే వ్యాఖ్యానిస్తారా? లేక తాజాగా వచ్చిన నోటీసులకు విచారణకు హాజరవుతారా? అనేది రాజకీయంగా చర్చగా మారింది.