బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీజేపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవా చేశారు. గురువారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్లకు నిద్ర పడలేదని తెలిపారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పట్టించుకోదని చెప్పారు. దీపా దాస్ మున్షీ, మాణిక్యం ఠాకూర్, మాణిక్యం రావులను విమర్శించే హక్కు లేదని సూచించారు. కేసీఆర్ ఇచ్చిన ప్యాకేజ్‌తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించారని ఆరోపించారు. అందుకే కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవిలో నియమించారని అన్నారు. కేసీఆర్‌కు నష్టం జరుగుతుందని బండి సంజయ్‌ని తప్పించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చినా ఏం మునిగిందని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోట్ పంపితేనే కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతాడని అన్నారు. బండి సంజయ్ ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో కనీసం జ్ఞానం కూడా ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉందో తన భార్యను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తనతో పాటు ఆర్టీసీ బస్సులో రావాలని కోరారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామో లేదో కిషన్ రెడ్డికి డైరెక్టుగా చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. మేడారానికి ఎక్కువ సంఖ్యలో బస్సులో వెళ్తున్నారని, అందుకే వారికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదని స్పష్టం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో కేసీఆర్ సొంత జిల్లాలో సభ పెట్టానని, హరీష్ రావు టార్గెట్ చేసి జైలో పెట్టించాడన్నారు. నా దూకుడుకు హరీష్ రావు తట్టుకోలేకపోయారని తెలిపారు. చక్రం తిప్పే హరీష్ రావు జిల్లాలో నా మార్క్ చూపించానని చెప్పారు. నేను ఏ బాధ్యతను నిర్వహిస్తానో ఆ బాధ్యత కచ్చితంగా వస్తుందని, దానికి సమయం పట్టిన రావాల్సింది వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని, రాహుల్ గాంధీ ప్రధాని రాష్ట్రం నుంచి 14 ఎంపీలను ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు.