యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఓ ఉపగ్రహం నేడు భూమిపై కూలిపోనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల బరువున్న ఈఆర్ఎస్-2 కక్ష్య నుంచి జారిపోయి భూ వాతావరణానికి సమీపంలో చేరింది. దీనిని 1995లో భూమిని పరిశీలించేందుకు ప్రయోగించారు. 2011లో దీని కాలపరిమితి తీరింది. ఇది నేడు వాతావరణంలోకి ప్రవేశించనుంది. వేగం కారణంగా తలెత్తే ఘర్షణకు మార్గ మధ్యలోనే చాలావరకు కాలిపోయిన కొన్ని విడిభాగాలు భూమిపై పడే అవకాశం ఉందని అంచనా వేశారు. నివాస ప్రదేశాలపై ఇవి పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. చాలావరకు శకలాలు సముద్రంలోనే పడతాయని అంచనా వేస్తున్నారు.
