తెలంగాణ కుంభమేళా.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. సారలమ్మ రాకతో నాలుగు రోజుల జాతర షురూ అయ్యింది. మహాజాతరకు జనం పోటెత్తారు. ఎటు చూసినా జనసంద్రమే.. మేడారం కిక్కిరిసిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు.
నేడు సారలమ్మర రాకతో నాలుగు రోజుల జాతర షురూ అయ్యింది. ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను (సారయ్య రూపంలో) ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మహాజాతర మొదలవనున్న వేళ మేడారం ఇప్పటికే జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దాంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయలతో సారలమ్మ యుద్ధం సాగించిన తీరును, వీరమరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని, రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని, సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు.