AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు కొడంగల్‌కు సీఎం.. ఇక అభివృద్ధికి మహర్దశ!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వెళ్లనున్నారు. దీంతో కొడంగల్‌కు రాజయోగం పట్టనుంది. అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి రూ.2945 కోట్లు మంజూరు చేసింది. అలాగే కొడంగల్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం కొత్త భవనం నిర్మాణానికి రూ.6.8 కోట్లు, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.344.5 కోట్లతో పలు రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన తండాలకు రహదారుల ఏర్పాటుకు ఎస్‌టీఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.27.886 కోట్లు మంజూరయ్యాయి.కొడంగల్‌లో మైనారిటీశాఖ ఆధ్వర్యంలోని టీఎంఆర్‌ పాఠశాల భవన నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేశారు. రూ.40 కోట్లతో నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రహదారులు నిర్మించనున్నారు.

అలాగే దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట జూనియర్‌ కళాశాలల భవన నిర్మాణానికి చెరో రూ.7.13 కోట్లు అందించారు. దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌ సమీపంలో రూ.360 కోట్లతో వెటర్నరీ సైన్స్‌ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం చేపట్టనున్నారు. మహిళా డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి రూ.11 కోట్లతో చేపట్టనున్నారు. కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిని 220 పడకల స్థాయికి పెంచడానికి రూ.224.50 కోట్లు మంజూరు చేశారు. పంచాయతీరాజ్‌ గ్రామీణ ప్రాంత రోడ్ల ఏర్పాటుకు 213.20 కోట్లు ఇవ్వనున్నారు. కొడంగల్‌ మండలం హస్నాబాద్‌లో 33-11 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ. 3.99 కోట్లు అందించారు. రూ.45 కోట్లతో కొడంగల్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేయనున్నారు.

ANN TOP 10