AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీవ్ సింగ్ పూరి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రిత్వ శాఖల వారిగా అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ అవసరాలపై కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 1400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ ను రేవంత్ రెడ్డి కోరనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు నితిన్ గడ్కరీతో భేటీకానున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర, జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు సహా అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.

ఢిల్లీ టూర్ లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు భేటీ అవుతారని సమాచారం. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ అంశాలపై వారితో చర్చించనున్నారు. అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ హామీలపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10