AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హెలికాప్టర్‌లోనూ మేడారం వెళ్లొచ్చు.. హైదరాబాద్ నుంచి టికెట్ ధర ఎంతంటే..?

తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జాతర ప్రత్యేక బస్సులతో పాటు ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేటు వాహనాల్లోనూ చాలా మంది భక్తులు మేడారం వెళ్తున్నారు. అయితే అన్ని దారులు మేడారం వైపే వెళ్తుండటంతో అక్కడ విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఉంది. బస్సులు, ట్రైన్లు కూడా ఇప్పటి నుంచే కిక్కిరిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో మేడారం వెళ్లాలనుకునే భక్తులు ఎలాంటి ప్రయాసలు లేకుండా ఈజీగా అమ్మవార్లను దర్శించుకోవచ్చు. కాకపోతే కొంచెం ఖర్చవుతుంది. హైదరాబాద్, హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ మేరకు హెలిటాక్సీ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌ సహకారంతో హెలికాప్టర్‌ సేవలను అందించేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్‌ సేవలు అందించనుంది. అలాగే అక్కడ 7 నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షేందుకు ‘జాయ్‌రైడ్’ను కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది. టికెట్ల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది.

హనుమకొండ- మేడారం-హన్మకొండ షటిల్‌ సర్వీసుల్లో ఒక్కరికి రూ.28,999 టికెట్‌ ధరగా నిర్ణయించారు. ఈ ప్రయాణంలో భక్తులు హనుమకొండ నుంచి బయలుదేరి మేడారంలో హెలికాప్టర్‌లో దిగొచ్చు. అక్కడ వీఐపీ దర్శనం అనంతరం తిరిగి హనుమకొండలో దింపుతారు. 20-30 నిమిషాల్లో హనుమకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మేడారంలో ఏరియల్‌ వ్యూ (జాయ్‌రైడ్‌) కింద 7 నిమిషాలపాటు గాలిలో తిప్పేందుకు ఒక్కొక్కరికి రూ.4,300 తీసుకుంటారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10