AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినీతికి కాంగ్రెస్ తల్లి లాంటిది.. మోడీ కీలక వ్యాఖ్యలు

బీజేపీ కార్యకర్తలు దేశం కోసం కష్టపడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని భారత మండపంలో బీజేపీ రెండో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు కష్టపడుతున్నారని, రానున్న వంద రోజులు మనకు చాలా కీలకమని చెప్పారు. ఇంకా కష్టపడి కార్యకర్తలు పని చేయాలని దిశ నిర్దేశం చేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు 18వ లోక్‌సభకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి బీజేపీ కార్యకర్తలు చేరువ కావాలని, అప్పుడే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టానికి అప్పుడే ఫలితం దక్కుతుందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అధికార గర్వం లేదని, ప్రజల సంక్షేమం, దేశం కోసం పాటు పడుతున్నారన్నారు. వికాసిత్ భారత్ కోసం ప్రజలంతా కృషి చేస్తున్నారు. ప్రజల స్వప్నాలు తప్పకుండా సాకారవుతాయి. రానున్న ఐదేళ్లు మనకు కీలకమని, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి కష్టపడుతామని వెల్లడించారు. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు 400పైగా సీట్లు వస్తాయని, బీజేపీకి 350 సీట్లు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకొచ్చారు.

నాకు ప్రజలే ముఖ్యం

అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని ధీమాను వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, అవినీతి నుంచి దేశానికి ముక్తి కల్పించామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు బాగు చేశామన్నారు. నన్ను విశ్రాంతి తీసుకోవాలని కొంత మంది చూస్తున్నారని, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశం ముఖ్యమని చెప్పారు. శివాజీ స్ఫూర్తి ఆదర్శమని, అందుకే దేశం కోసం 24 గంటలు ఆలోచిస్తానన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం ముఖ్యం కాదు.. కుటుంబం కూడా ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో ఆదివాసీలు, విశ్వకర్మల కోసం పత్యేక పథకాలు తీసుకువచ్చామన్నారు. భేటీ పడావో, భేటీ బచావ్ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారని వెల్లడించారు. మహిళాలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష వేస్తున్నామని అన్నారు. రేసు కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారిస్తున్నామని తెలిపారు.

విభజన రాజకీయం అంటేనే కాంగ్రెస్

విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి తల్లి లాంటిదని వ్యాఖ్యానించారు. దేశానికి కాంగ్రెస్ అతిపెద్ద ముప్పు అంటూ మండిపడ్డారు. ఈ ముప్పు నుంచి దేశ ప్రజలు బయటపడాలని సూచించారు. కాంగ్రెస్ అంటేనే విభజన రాజకీయమని అన్నారు. సైన్యాన్ని కూడా కాంగ్రెస్ అవమానిందని చెప్పారు. రాఫెల్ కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం.. హెచ్‌ఏఎల్ అమ్ముకున్నట్లు పుకార్లు పుట్టించారని తెలిపారు. హెచ్‌ఏఎల్ ఇప్పుడు లాభాల్లో నడుస్తుందన్నారు. పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తే కాంగ్రెస్ నమ్మలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు అందర్మథనం జరుగుతుందని, ఓ వర్గం మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మరో వర్గం మోడీని తిట్టడం మానుకోవాలని చూస్తుందన్నారు. అయోధ్యలో రామమందిరం పూర్తి చేసి ఐదు దశాబ్ధాల కళ నెరవేర్చామని, ఆర్టికట్ 370 ని రద్దు చేశామన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం.. కొత్త పార్లమెంట్ నిర్మించి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని చెప్పారు. అబద్ధపు హామీలు ఇవ్వడంలో విపక్షాలు పోడిపడుతున్నాయని విమర్శించారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. విపక్ష నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందంటున్నారని వెల్లడించారు.

కుటుంబ రాజకీయాలు చెల్లవు: అమిత్ షా

అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బహిష్కరించిందని వాపోయారు. వారసత్వం, అవినీతి, సంతుష్టికరణ రాజకీయాలకు కలిగినదే ఇండియా కూటమి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ హయాంలో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మోడీ 3.0 ప్రభుత్వంలో ఉగ్రవాదం పూర్తిగా లేకుండా పోతుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమపై విపక్షాలు ఒక్క అవినీతి ఆరోపణలు కూడా చేయలేదన్నారు. ఏడు కుటుంబ పార్టీలు సముహమే ఇండియా కూటమి అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ పాండవుల చేతిలో ఇండియా కూటమి కౌరవులు ఓడక తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాలు ఇకపై చెల్లవన్నారు. ఇండియా కూటమికి కనుచూపుమేరలో కూడా అధికారం కనిపించడం లేదని, 17 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

ANN TOP 10