తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలు వ్యూహాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. కానీ, కాంగ్రెస్ లో ఆయనకు సీటు దక్కలేదు.
దీంతో..వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్న వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరగగా.. ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు కేటాయించింది. ఆ నిధుల వినియోగంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు అధికారం కల్పించింది. దీనికితోడు త్వరలో మార్కెట్ కమిటీలతో పాటు పలు నియామక కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే తెల్లం కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తితో ఉండటంతో త్వరలోనే పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
లోక్సభ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే తెల్లం వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని..పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. వెంకట్రావు చేరటం ద్వారా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది మంత్రి పొంగులేటి లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో, ఎమ్మెల్యే వెంకటరావు పార్టీ మార్పు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.