AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముమ్మాటికీ జల దోపిడే.. – ఒప్పందాల్లో మరణ శాసనాలు.. ఉత్తమ్‌ ఫైర్‌

– అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల మంటలు చెలరేగుతున్నాయి. ప్రాజెక్ట్స్‌ వార్‌ పతాకస్థాయికి చేరింది. కృష్ణా జలాల వినియోగంలో, వాటాలో, హక్కుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సాగునీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో సోమవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గడిచిన పదేళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించారు.

సోమవారం సభా సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలందరికీ వాస్తవాలను తెలియజేసేలా డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం నుంచీ చోటుచేసుకున్న పరిణామాలను మంత్రి ఉత్తమ్‌ వివరించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి విషయంలోనూ రాజీపడిందని, ఏపీ జల దోపిడీకి ఉద్దేశపూర్వకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇచ్చారని లెక్కలతో సహా వివరించారు. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే.. ఒప్పుకున్నారని, ఏపీ సీఎంతో కుమ్మక్కై నీటి వాటాను వదిలేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తెలంగాణకు నష్టం చేసే ఒప్పందాలపై.. కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు. అదే తరహా పీపీటీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని స్పీకర్‌ తిరస్కరించారు.

పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో ముఖ్య అంశాలు ఇవీ…

– నీళ్ళ కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్ఫూర్తికి భిన్నంగా గడచిన పదేళ్లలో తీవ్ర అన్యాయం జరిగింది. న్యాయమైన వాటాను సైతం తెలంగాణ వాడుకోలేకపోయింది.

– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే తొమ్మిదిన్నరేళ్ల కాలంలో సుమారు 1200 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి బేసిన్‌ వెలుపలకు వెళ్లింది. దాదాపు 50% నీటిని ఇల్లీగల్‌గా తెలంగాణ నుంచి ఏపీ వాడుకున్నది. ఇది ఆంధ్రకు దక్కిన కోటాకు అదనం. దీని మొత్తానికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వమే. బేసిన్లో వాటర్‌ ఇన్‌ ఫ్లో తగ్గినా ఏపీకి మాత్రం డైవర్షన్‌ పెరిగింది.

– తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులరేటరీ కెపాసిటీ 44,000 క్యూసెక్కుల నుంచి 92,500 క్యూసెక్కులకు ఏపీ పెంచుకున్నది. కేసీఆర్‌ ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోయింది. రోజుకు సగటున 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి డ్రా చేసుకున్నది.

– దీనికి అదనంగా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకెళ్ళేలా ఏపీ ప్రాజెక్టును చేపట్టింది.

– హెల్సింకీ రూల్స్‌ ప్రకారం పరీవాహక ప్రాంతం నిష్పత్తికి అనుగుణంగా నీటి వాటాలు ఉండాలి. ఆ ప్రకారం తెలంగాణకు 68% మేర ఉండాలి.

– తెలంగాణ నీటి వాటాల్లో తీవ్ర అన్యాయం జరిగింది కేసీఆర్‌ హయాంలోనే. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులకు సుమారు 225.24 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉన్నా డిమాండ్‌ చేసి సాధించుకోలేకపోయింది. గడచిన పదేళ్లలో వాడుకున్నది సగటున ఏటా 59.54 టీఎంసీలు మాత్రమే.

– కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులకు తీసుకోవాల్సిన నీటిని కూడా డ్రా చేసుకోలేకపోయాం.

– తెలంగాణ వాటాగా అగ్రిమెంట్‌ ప్రకారం 299 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నా కేవలం 197.83 టీఎంసీల చొప్పున మాత్రమే గడచిన పదేళ్లలో ఏటా సగటున వాడుకోగలిగాం.

– మొత్తం 525 టీఎంసీలు అడగాల్సి ఉంది. కానీ కేవలం 299 టీఎంసీలకు మాత్రమే ఏపీతో ఒప్పందాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల లెక్కలను కేంద్ర ప్రభుత్వ సమావేశాల్లో వివరించలేకపోయింది.

– తెలంగాణకు శాశ్వతంగా నీటి హక్కులు రాకుండా అన్యాయానికి పాల్పడింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసేలా కృష్ణా జలాల ఒప్పందాల్లో మరణ శాసనం రాసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10