హైదరాబాద్: కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణప్రదాయిని. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం వరకు కృష్ణా నది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 10 లక్షలకు పైగా మంది వలసలు వెళ్లి తట్టపని, పారపని, మట్టిపని, బొగ్గుపనుల కోసం వలసలు వెళ్లారు. ఇందుకు కారణం ఒక వ్యక్తి. కరీంనగర్ ప్రజలు తరిమికొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యోపాపం అని వలస వచ్చారని ఆదరించి ఎంపీగా గెలిపిస్తే అటే పోయారు’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
‘‘ ఈ రోజు అదే పాలమూరు జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాల మీద చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు (కేసీఆర్) ఇక్కడకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా?. కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68 శాతం వాటా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని ఒక ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చినప్పుడు హూందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్ధతు పలికి.. తెలంగాణ హక్కుల మీద, నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డామని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సమయం, సందర్భంలో సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో దాక్కొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మిగతావారిని పంపించి పచ్చి అబద్దాలు ఆడిపిస్తున్నారు.
‘‘ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కూర్చి ఖాళీగా ఉంది. ఈ రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మారావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తే వారన్న నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావుకు బాధ్యతలు ఇవ్వాలి. పద్మాగారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం కొట్లాడేవారు. వారి లాంటివాళ్లను పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. మొత్తంగా కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రశక్తే లేదు. తెలంగాణ వాటా నీళ్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.