నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీంతో చర్చ లేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అయితే ఇదివరకే రాష్ట్రంలో హుక్కా కేంద్రాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా బిల్లును ప్రవేశ పెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఏకగ్రీవంగా ఆమోదించింది. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో హుక్కా కేంద్రాల మాటున నగరంలో జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది.