భార్య విడాకులు ఇవ్వటం లేదని జైలు వార్డెన్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటలో జరిగింది. అయితే.. వికారాబాద్ జైలులో వార్డెన్‌గా పని చేస్తున్న సామ కళాధర్ రెడ్డికి.. రామన్నపేటకు చెందిన గడ్డం రాజిరెడ్డి కూతురుతో వివాహం జరిగింది. అయితే.. ఈరోజు తన భార్య విడాకులు ఇవ్వటం లేదంటూ.. తన అత్తగారింటి వద్దే రోడ్డుపై అందరూ చూస్తుండగానే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే చాలా రక్తం పోవటంతో.. అతని పరిస్థితి కొంత విషమంగా మారినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అసలు కళాధర్ ఎందుకు తన భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాడు.. అన్నది ఇక్కడ ఆసక్తికర విషయం. పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే నడిచింది. అయితే.. కొద్ది రోజులుగా తన భార్య అత్తగారింటికి వెళ్లి.. అక్కడే ఉండిపోయింది. కాపురానికి రమ్మంటే రాకుండా.. వేధిస్తోంది. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా.. తన భార్య రాకపోవటంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కాపురానికి తన దగ్గరికి రానప్పుడు.. విడిపోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అందుకు.. భార్యను విడాకులు అడిగాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్.. కాపురాకుండా అమ్మగారింట్లోనే ఉంటున్న ఆ భార్యామణి మాత్రం విడాకులు ఇవ్వటం లేదు. అటు కాపురానికి రాకుండా.. ఇటు విడాకులూ ఇవ్వకుండా.. తనను మానసికంగా వేధిస్తోందంటూ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. అందుకే.. ఈరోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చి.. అందరూ చూస్తుండగానే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు.