AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు’

బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని అన్నారు. సీఎం జగన్‌తో కుమ్మక్కై ఏపీకి ప్రాజెక్టులను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆదివారం నల్గొండలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. దక్షిణ తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఎడారిలా మార్చారని దుయ్యబట్టారు. నీటిలో మునిగే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని నల్గొండ జిల్లాకు వస్తారని ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. 13న బీఆర్‌ఎస్ తలపెట్టిన సభ రోజే కేసీఆర్ బొమ్మలతో నిరసనలు చేస్తామని, కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఎన్నికల అస్త్రంగానే కేసీఆర్ చూశారని, ఎస్‌ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేసి నల్లగొండ జిల్లాను ఎండబెట్టాడని ఫైర్‌ అయ్యారు. కేఆర్‌ఎంబీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీష్ రావుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్దపీట వేసామని, గత ప్రభుత్వం అప్పులను మిగిల్చి వెళ్తే బడ్జెట్‌లో 13 శాతం అప్పుల చెల్లింపులకే పోతుందన్నారు. గత ప్రభుత్వం అంకెల, మాటల గారడితో కాలం వెల్లదీసిందని అన్నారు. రెగ్యులర్ బడ్జెట్ చాలా గొప్పగా ఉంటుందని వివరించారు. అన్ని రంగాల్లో బడ్జెట్‌లో సమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడని, ఆయన చేసిన అప్పులు రాష్ట్రంపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు. త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. బడ్జెట్ పై విమర్శలు చేస్తున్న హరీశ్ రావు, కేటీఆర్ మూర్ఖులని ధ్వజమెత్తారు. కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చిండని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ANN TOP 10