AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ ఫైర్‌

కేసీఆర్‌తో మొదలుపెట్టిన రేవంత్.. కేటీఆర్, హరీశ్ రావుపై సెటైర్లతో!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం సభకు గౌరవం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకే శాపనార్థాలు బెట్టడం బీఆర్ఎస్ నేతలకు సరికాదన్నారు. తెలంగాణ అనేది ఒక భావోద్వేగమని అన్నారు రేవంత్. అందుకే టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామన్నారు. ఉద్యమ సమయంలోనే అనేక మంది టీజీ అనే అక్షరాలను తమ వాహనాలకు ఉపయోగించారన్నారు. మరోవైపు, జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర గేయంగా ఆమోదించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

కోట్లాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వ చర్యలను ప్రతిపక్ష పార్టీ అభినందించకపోగా విమర్శిస్తోందని రేవంత్ మండిపడ్డారు. నష్టపోతే ఎవరైనా ఆటో తగలబెట్టుకుంటారా? ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆటోడ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఈ నెల 1వ తారీఖునే జీతభత్యాలు వేశామన్నారు. బీఆర్ఎస్‌లోని కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఆటోలో ప్రయాణించి నిరసనలు తెలుపుతున్నారని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో నటుడికి పెట్రోల్ దొరికింది కానీ.. 5 రూపాయల అగ్గిపెట్టే దొరకలేదంటూ కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే రైతుబంధు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని.. గత ప్రభుత్వం 2019-20లో 9 నెలలపాటు రైతుబంధు ఇచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 7వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగులను భర్తీ చేశామని రేవంత్ చెప్పుకొచ్చారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలను నియమిస్తామన్నారు. ప్రభుత్వం దివాళా తీసిందని, చిల్లిగవ్వ కూడా లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. ఇది ఎవరి పాపం అని ప్రశ్నించారు రేవంత్.

తనతో అధికార పక్ష ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలుస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చుకుంటున్నారన్నారు. అయితే, తాము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదని.. తమతో ఎవరైనా కలిసి ప్రజల సమస్యలను తెలపవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 25 శాతం పదవులు మైనార్టీలకు ఇచ్చామన్నారు. ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ధరణి, హౌసింగ్ సమస్యల గురించే ఎక్కువ దరఖాస్తులు వస్తాయన్నారు.

ANN TOP 10