త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 3,30,37, 113 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 8)న తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఈ తుది ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు 1,64,47,132 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నారని ఈసీ పేర్కొంది. అలాగే, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు 15,378 మంది ఉన్నారని జాబితాలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్ఆర్ఐ ఓటర్లు 3,399 మంది ఉండగా, 80ఏళ్లకు పైబడిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓట్లర్లు 5,28,405 మంది ఉన్నారు.
తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,47,726 మంది ఓటర్లు ఉంటే.. రాష్ట్రంలో అత్యల్పంగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటు కోసం అప్లయ్ చేసుకోవచ్చునని సీఈవో వికాస్ రాజ్ సూచించారు.









