AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరంపై రిటైర్డ్ జడ్జితో విచారణ..! కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకుంటాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశామని, అయితే ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్‌ జడ్జిని ఇస్తామని చెప్పారన్నారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు.

ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్‌కు ఛాంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గదులను కేటాయించామన్నారు. ఎక్కడ ఇవ్వాలో స్పీకర్‌ నిర్ణయమని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెడతారా? లేదా అనేది సంబంధిత మంత్రి ప్రకటిస్తారన్నారు. అయితే మేడిగడ్డ మీద చర్చను పక్క‌దారి పట్టించడానికే బీఆర్ఎస్ పార్టీ కేఆర్‌ఎంబీని తెరమీదికి తీసుకొచ్చారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్పప్పుడు ఏపీ పోలీసులు నాగార్జున సాగర్‌పైకి తుపాకులతో వచ్చి మూడురోజులు ఉన్నారని, అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

రాయలసీమకు రోజూ 12 టీఎంసీల నీళ్లు తరలించుకునే అవకాశాన్ని ఇచ్చిందే గ‌త ప్ర‌భుత్వం అని స్పష్టం చేశారు. అందుకే కృష్ణ బేసిన్‌లో ప్రజలు తిరస్కరించారని, బీఆర్‌ఎస్‌ గెలిచిన సీట్లే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తాను కేసీఆర్‌ వచ్చినా కలుస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి కలిసినప్పుడు జరగని చర్చ, తనను కలిసినప్పుడు ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సభలో ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని, అయితే ఆయన తొలిరోజు సమావేశానికి రాలేదని, బీఏసీకి కూడా హాజరు కాలేదన్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరామన్నారు.

ANN TOP 10