AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. సినిమా మొదలైనట్టే..?

కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి?
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా కీలక నేతలు, సిట్టింగులు పార్టీని వీడుతుండటంతో ‘కారు’ కాస్త పంచర్ అవుతూ వస్తోంది..!. ఇప్పుడు ఏకంగా గతంలో మంత్రిగా పనిచేసిన, పార్టీ కీలక నేత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. తన సోదరుడు, కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరుతారన్న సమయంలో.. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి కూల్ చేసింది నాటి కేసీఆర్ సర్కార్. సీన్ కట్ చేస్తే.. పట్నంకు టికెట్‌ కూడా ఇవ్వకుండా తాండూరు టికెట్‌ను ఫైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించడంతో ఆయన మరింత అసంతృప్తికి లోనై అంతంత మాత్రమే ఎన్నికల్లో పనిచేశారు.

పార్టీలో చేరితే పరిస్థితేంటి..?
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక ‘ఆగేదేలే..’ అని.. పార్టీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే.. పట్నం, తన సతీమణి సునీతారెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఈ ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని పట్నం అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. సునీతారెడ్డి ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరితే చేవెళ్ల ఎంపీగా సునీతారెడ్డిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచనలో ఉందని తెలియవచ్చింది. రేవంత్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే గురువారం రాత్రి సీఎంను కలిశారని టాక్ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో కొడంగల్‌లో రేవంత్ నిర్వహించే భారీ బహిరంగ సభావేదికగా సీఎం సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డిలో పేరుగాంచిన, ఆర్థికంగా, రాజకీయంగా అన్నింటిలో ముందున్న పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతుండటం షాకింగే. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ పరిస్థితి ఉంటే.. అదేగానీ వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలువురు మంత్రులు త్వరలోనే కీలక నేతలు, సిట్టింగులు కాంగ్రెస్‌లోకి క్యూ కడతారని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.. అంటే ఇప్పుడిప్పుడే సినిమా మొదలైందన్న మాట.

ANN TOP 10