సరికొత్త వ్యూహాంతో హస్తం పార్టీ ప్లాన్
హాజరుకానున్న ప్రియాంక గాంధీ
రెండు గ్యారంటీల అమలుపై ప్రకటన!
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. ఆ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంటు ఎన్నికల్లో ఫాలో అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టింది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగానే మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాపై చర్చించింది. టికెట్ ఆశించే నేతల జాబితా భారీగా ఉండడంతో అభ్యర్ధుల వడపోతపై హైకమాండ్ దృష్టిసారించింది. అదే విధంగా గులాబీ పార్టీ ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యుహాలను రచిస్తుంది. నల్గొండలో బీఆర్ఎస్కు పోటీగా భారీ సభకు హస్తం పార్టీ రెడీ అవుతోంది.
చలో నల్లగొండ సభకు పోటీగా కాంగ్రెస్ సభ ఉంటుందని తెలుస్తోంది. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా 2లక్షల మందితో ఈ సభ నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 13న కృష్ణా జలాల అంశంపై కేసీఆర్ చలో నల్లగొండ పేరుతో భారీ సభ నిర్వహించనుండగా దానికి పోటీగా 2 లక్షల మందితో కాంగ్రెస్ పార్టీ సభ పెడదామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించారని తెలుస్తుంది. రాష్ట్రంలో కాళేశ్వరం ఇష్యూ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీంతో కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని పార్టీ నేతలను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో 2 లక్షల మందితో సభ పెట్టాలని కోరగా.. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వనించడం ద్వారా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రియాంక సభలోనే మరో రెండు గ్యారంటీలైన గృహ జ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అక్కడి నుంచే ప్రారంభించాలని హస్తం పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తుంది.









