మధ్యప్రదేశ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఓ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంగళవారం ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. బాణాసంచా ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ మంటల్లో పలు వాహనాలు సైతం దగ్ధమవుతున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీం బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అగ్నిమాపక సిబ్బంది ప్రారంభించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మంటలు వ్యాపిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులకు అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 100 ఇళ్లకు పైగా ఖాళీ చేయించారు. గాయాపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఎంత అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పరిస్థితిని తక్షణమే అంచనా వేయడానికి హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలాన్ని సందర్శించాలని, మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఐపీఎస్ అజిత్ కేసరి, డీజీపీ అరవింద్ కుమార్‌లను ఆదేశించారు.









