ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో పథకాల నిధులు విడుదల కోసం 124 సార్లు బటన్ నొక్కానని జగన్ అన్నారు. అలాగే మీరు జగన్ కోసం ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కలేరా అని అడిగారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకటి, పార్లమెంట్ ఎన్నికల కోసం మరో బటన్ నొక్కాలని ప్రజలను కోరారు. ఏలూరు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని అన్నారు. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్కరికీ చెప్పాలన్నారు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలన్నారు. జగనన్నకు ఓటు వేయకపోతే ఇప్పుడు ఉన్న స్కీమ్‌లకు అమోదం తెలపనట్లేనన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే లంచాలు, వివక్ష మళ్లీ మొదలవుతుందని ఓటర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ పోలింగ్ బూత్‌కు వెళ్లి జగన్ కోసం బటన్ నొక్కాలని ఓటర్లకు చెప్పారు. చంద్రబాబు రాజకీయం అంతా ఎత్తులు, పొత్తులేనని, గ్లాస్ ప్రతీ ఒక్కరి రక్తం తాగుతుందని విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రం టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడని, ఎన్నికలు వస్తే చంద్రబాబు దత్తపుత్రుడిని పిలుస్తాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విడదీసిన పార్టీ కూడా వస్తోందని షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు.
