AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏపీలో రైతులు, యువత, మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందారని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని చెప్పారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామని, పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానంలో విద్య బోధనకు వెళుతున్నట్టు చెప్పారు.

ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్య ప్రాధాన్యత గుర్తించి అమ్మ ఒడి మొదలుకుని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారికి రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11,901 కోట్లు ఫీజు రీయింబర్స్‌ చేశామని తెలిపారు. మనబడి నాడు – నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని చెప్పారు. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటి వరకు రూ. 3,367 కోట్లు ఖర్చు చేశామని, విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని, అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగిస్తున్నంత సేపు సభలో నినాదాలు చేశారు. గవర్నర్‌ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం టీడీపీ నేతలు చేశారు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.

ANN TOP 10