AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

కేబినెట్‌ భేటీలో మరో రెండు గ్యారెంటీలకు ఆమోదం..!

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సారి అసెంబ్లీలో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. మరో రెండు గ్యారంటీలకు సైతం ఈ సందర్భంగా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత కరెంటుకు ఆమోదం తెలిపింది.

రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చేందుకు, రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు రాష్ట్ర చిహ్నంలో పలు మార్పులు చేయాలని సైతం నిర్ణయించారు. కులగణనతో పాటు అలాగే గ్రూప్‌-1లో 160 పోస్టులు కలుపుతూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ మరోసారి జారీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అలాగే, కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ, తెలంగాణ హైకోర్టుకు వంద ఎకరాలు, 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించి విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు.

మరో రెండు గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారన్నారు. ఆరు గ్యారంటీలపై ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. ఉద్యోగాల భర్తీపై త్వరలోనే ప్రకటన ఇస్తామన్నారు. మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగిందని, ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని తీర్మానం చేశామన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదించామన్నారు.

ANN TOP 10