ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరాలని తనను ఒత్తిడి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఢిల్లీలోని రోహిణిలో ఓ పాఠశాలకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వం ఏటా 40 శాతం బడ్జెట్ విద్యా వైద్యానికి వెచ్చిస్తుంటే బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం బడ్జెట్‌లో 4 శాతమే ఈ కీలక రంగాలపై ఖర్చు చేస్తోందని దుయ్యబట్టారు. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంతటి కుట్రకైనా తెగబడుతుందని, తనపై ఎంత ఒత్తిడి చేసినా తాను తలవంచబోనని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరితే కేసుల నుంచి బయటపడేస్తారని, అయితే తాను బీజేపీ పంచన చేరే ప్రసక్తే లేదని వారికి తేల్చిచెప్పానని అన్నారు. ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలన్నీ తమ వెంట పడ్డాయని మండిపడ్డారు. మంచి ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేయడమే సత్యేందర్ జైన్ చేసిన తప్పిదమా అని కేజ్రీవాల్ నిలదీశారు. పాఠశాలల అభివృద్ధికి, మౌలిక వసతుల పెంపునకు పాటుపడిన మనీష్ సిసోడియానూ విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా తాము తలవంచబోమని తెల్చీ చెప్పారు. ఢిల్లీ ప్రజలు తమపై ప్రేమను, ఆశీస్సులను ఇలాగే అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.









