AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దమ్ముంటే చర్చకు రా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

అసెంబ్లీ ఎన్నికల రోజు ఏపీ పోలీసులు తుపాకులు పట్టుకుని వస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నువ్వు ర** గాడివి కాబట్టే జగన్ వచ్చి ప్రాజెక్ట్ స్వాధీనం చేసుకున్నాడని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జగన్‌ను రమ్మను అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. గతంలో కృష్ణా నదీ జలాలు పూర్తిగా తెలంగాణ చేతుల్లో ఉండేదన్నారు. నీటి దోపిడీ జరగడానికి కారణం కేసీఆర్ అని, పదవులకు, కమీషన్లకు కేసీఆర్ లొంగిపోయారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యం కంటే తెలంగాణ వచ్చాక నష్టం జరిగిందని మండిపడ్డారు. 2013 లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినా ఉమ్మడి పాలమూరు నేతలు పట్టుబట్టి సాధించారని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును రెండు ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లల్లో పూర్తి చేయలేదని అన్నారు. ఆ ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్ కోర్టుల్లో కేసులు వేశారని చెప్పారు. తెలంగాణకు ఎవరు ఎక్కువ ద్రోహం చేశారో అసెంబ్లీలో చర్చ చేద్దామని తెలిపారు. క్రిష్ణా జలాల నుండి రోజుకు శ్రీశైలం కంటే ముందు రెండు టీఎంసీల కన్నా ఎక్కువ తెలంగాణ తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఏపీ రోజుకు 13 టీఎంసీల నీళ్లు తరలించుకుపోతున్నారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై రెండు రోజులు చర్చిద్దామని, ప్రజలను గందరగోళం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ప్రాజెక్టులను ఎవరికి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజలను గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారని, 90 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదని అన్నారు. కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీకి తరలించుకుపోయారని అన్నారు. రెండు టీఎంసీల కోసం కేసీఆర్ లక్షా 20 వేల కోట్లతో కాళేశ్వరం కట్టారని చెప్పారు. కేసీఆర్, జగన్ చర్చల్లో కృష్ణా నదీ జలాలపై కుట్ర జరిగిందని అన్నారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఉమ్మడి ఏపీలో జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ANN TOP 10