ఆ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో తన మనసులో మాట పంచుకున్నారు. ఈ ఐదేళ్లు విజయవంతంగా పాలన కొనసాగించి.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండేలా సీఎంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత తొమ్మిదేళ్లలో ప్రజల తమ హక్కులను కూడా స్వేచ్ఛగా చెప్పుకోలేని పాలన మాజీ సీఎం కేసీఆర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి.. తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏర్పాటుకు అధికార బలాన్ని ఇచ్చారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన ఆరు పథకాల్లో రెండు అమలు చేశావని.. ఇంకా నాలుగు పథకాల్ని కూడా తప్పకుండా నువ్వు అమలు చేస్తావని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న విషయం నీకు తెలిసిందేనని.. వాళ్ళ రాజకీయ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేసి.. రాజకీయంగా దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మెజారిటీ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.
అంతకుముందు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినా, తనకు ఓటు వేసిన 70 వేల మందికి జవాబుదారీగానే ఉంటానని, ఇది తన మొదటి ప్రాధాన్యత అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రెండో ప్రాధాన్యతలో తనకు ఓటు వేయని 80 వేల మందికి కూడా అండగా ఉంటానన్నారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, కాబట్టి ఆలోచించి ఓటు వేయమని తాను ముందునుంచే చెప్తూ వస్తున్నానని.. అయితే ఎక్కడో చిన్న తేడా కొట్టడంతో తనకు 80 వేల మంది ఓటు వేయలేదని ఆవేదన చెందారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంతోషంగా ఉందన్నారు. తాను ఓట్ల కోసమే ఏదీ చేయనని.. ఆపదలో ఎవరున్నా అందుబాటులోకి వస్తానని హామీ ఇచ్చారు. 2014లో తాను ఓడిపోయినా.. మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేశానన్నారు. 2018లో గెలిచాక.. సభలో అడిగి సాధించానని చెప్పారు. ప్రస్తుతం తాను కొన్ని రోజులు దూరంగా ఉంటానని.. అయితే తాను తలపెట్టిన పనులేమీ ఆగవని తెలిపారు. పండుగలు సైతం యథావిధిగా నిర్వహిస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీమ్‌లను అందరూ దరఖాస్తు చేసుకోవాలని జగ్గారెడ్డి ప్రజలను కోరారు. ఎవరైనా మిస్ అయితే.. సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఆఫీస్‌కి వెళ్లి దరఖాస్తులు ఇవ్వండని చెప్పారు. తనకు ఓటు వేసిన 70 వేల మందికి, ఓటు వేయని 80 వేల మందికి ఎల్లప్పుడూ అండగానే ఉంటానని.. ఏ ఒక్కరిపై కూడా తనకు కోపం లేదని అన్నారు. నియోజకవర్గంలో గెలిచినా, ఓడినా.. ప్రజాప్రతినిధులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారన్నారు. కాకపోతే.. ఓటు వేసేటప్పుడు 80 వేల మంది ఆలోచన చేయలేదని, కనీసం ఇప్పుడైనా ఆలోచన చేయాలని జగ్గారెడ్డి కోరారు.