భోపాల్: 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు వార్తల్లో నిలిచాడు. తన వయసులో సగం కన్నా తక్కువ వయసున్న మహిళను పెళ్లాడాడు. ఒంటరి తనాన్ని భరించలేక 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే ఆ వయో వృద్ధుడికి ఇది మూడో పెళ్లి కావడం విశేషం. మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతానికి చెందిన 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ నాజర్ తాజాగా 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాజర్‌కు ఇది మూడో పెళ్లి. రెండో భార్య మరణించిన తర్వాత ఒంటరైన అతడు మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఫిరోజ్ జహాన్‌ను గత ఏడాదే పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ ఏడాది జనవరిలో ఇది వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్ జహాన్‌తో నాజర్ నిఖాకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, హబీబ్ నాజర్ తొలి వివాహం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. మొదటి భార్య మరణించడంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మూడో వివాహం జరిగింది. 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌కు కూడా ఇది రెండో పెళ్లి. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది.
మరోవైపు 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడైన హబీబ్ నాజర్‌ను చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో ఆయనను పెళ్లి చేసుకున్నట్లు ఫిరోజ్ జహాన్ మీడియాకు తెలిపింది. భర్త నాజర్ ఆరోగ్యంగా ఉన్నాడని, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పింది. నాజర్‌ను పెళ్లి చేసుకోవడంలో ఎవరి బలవంతం లేదని వెల్లడించింది.