గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్, అమరుల్లా ఖాన్ ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కౌన్సిల్‌కు చైర్మన్ చేరుకోని పరిస్థితి. చాలా సేపటి నుంచి చైర్మన్ కోసం కోదండరాం, అమరుల్లా ఖాన్ కౌన్సిల్ హాల్‌లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి మేరకే ప్రమాణం చేయించేందుకు చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా సేపటి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలిలోనే వేచి చూస్తున్నారు. చైర్మన్ తీరుపట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా… గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు పంపగా.. అందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపుతూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేశారు.