AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో బరిలో నిలిచేది ఎవరంటే..

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా.. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌.. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్‌, సంతోష్‌ కుమార్‌ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఏపీలో మూడు తెలంగాణ నుంచి మూడు.. మొత్తం ఆరు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో బలం చూసుకుంటే వైసీపీకే మూడు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. వైసీపీ నుంచి రఘునాథ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావుకు రాజ్యసభ కేటాయించాలని భావిస్తోంది అధిష్టానం. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే బలం లేకున్నా టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. గతేడాది ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చివరి నిమిషంలో అనూహ్యంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిచింది. మళ్లీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10