AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమ్మా, నాన్న.. నేను జేఈఈ చేయలేను.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని తనువు చాలించింది.

కోటాలోని శిక్షానగరి (Shiksha Nagri ) ప్రాంతంలో నివసిస్తున్న నిహారిక (Niharika) అనే 18 ఏళ్ల విద్యార్థిని జేఈఈ పరీక్షకు సిద్ధమవుతోంది (JEE Aspirant). జనవరి 31వ తేదీన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన నిహారిక.. తను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాను జేఈఈ చేయలేనంటూ తన తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించింది. ‘అమ్మా, నాన్న.. నేను జేఈఈ చేయలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకున్న ఆప్షన్‌ ఇదొక్కటే.. నేనో చెత్త కూతుర్ని. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో రాసింది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న కోటా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఏడాది వారం రోజుల్లోనే ఇది రెండో ఆత్మహత్య ఘటన కావడం గమనార్హం. ఈనెల 23వ తేదీ నీట్‌ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ మెడికల్ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సన్నద్ధమవుతున్నాడు. జవహర్‌నగర్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 23వ తేదీన రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 2023లో కోటాలో ఏకంగా 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ANN TOP 10