AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవును.. నేను మేస్త్రీనే.. వస్తున్నా, కాస్కోండి.. విపక్షాలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన సత్తాను.. లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఒక వైపు పాలన చూసుకుంటూనే మరోవైపు.. ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పులి బయటికి వస్తుంది అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి గట్టి సమాధానం ఇచ్చారు. పులి బయటికి వస్తే బోను రెడీగా ఉందని హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో తెలిపారు.

ఎన్నికల వేళ తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీఎం పదవి అంటే గుంపు మేస్త్రి పాత్ర వంటిదని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు రేవంత్ గట్టిగా సమాధానం ఇచ్చారు. తాను గుంపు మేస్త్రీనేనని తెలిపిన రేవంత్ రెడ్డి.. విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రీని అంటూ బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని ఘోరీ కట్టే మేస్త్రీని కూడా తానే అంటూ సవాల్ విసిరారు. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి వస్తానని.. అక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాకముందే.. బీఆర్ఎస్ నేతలు హామీలు అమలు చేయలేదని విమర్శలు చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి.. వాళ్ల పాలనలో ఏమీ చేయలేదని మండిపడ్డారు. బిల్లా, రంగాలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయల్దేరారని బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులులో ఉన్న తెలంగాణను పదేళ్లు పాలించి లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ప్రజల కోసం సోనియా గాంధీ ముందుకు వచ్చారని తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినప్పుడు ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ ఎక్కడ దాక్కుందని ప్రశ్నించారు. ఇక మోదీ పాలనపైనా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2004, 2009లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవులను వదులుకున్నారని చెప్పారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని తెలిపారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించేందుకే ప్రధాని మోదీ.. ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10