AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి

గవర్నర్‌ తమిళిసై ఆమోదం
హైదరాబాద్‌ (అమ్మన్యూస్‌): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌ గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్‌ రెడ్డి నియామకాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులుసైతం వెలువడనున్నాయి. త్వరలో టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్‌ గా మహేందర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో పాతవారితో రాజీనామా చేయించింది. కొత్తవారి నియామకానికి చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం బోర్డులో చైర్మన్‌, 10 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్‌ పదవితో పాటు ఎనిమిది మంది సభ్యుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో.. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ పదవికోసం, సభ్యుల నియామకంకోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.

చైర్మన్‌ పదవికోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలన తరువాత మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డివైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆ మేరకు టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్‌ గా మహేందర్‌ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం గవర్నర్‌ కు పంపించింది. తాజాగా మహేందర్‌ రెడ్డి ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. దీంతో నూతన టీఎస్పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. మహేందర్‌ రెడ్డి వరంగల్‌ ఎన్‌ఐటి నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్‌ చదువుతుండగా ఐపీఎస్‌ కు సెలెక్ట్‌ అయ్యారు. గోదావరిఖని ఏఎస్పీ గా కెరీర్‌ ప్రారంభించిన మహేందర్‌ రెడ్డి.. 2017 నుంచి 2022 డిసెంబర్‌31 వరకు తెలంగాణ డీజీపీ గా పనిచేశారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శలు పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళనపై రేవంత్‌ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డితో పాటు సభ్యులందరితో రాజీనామా చేయించారు. వారి రాజీనామాలను గవర్నర్‌ ఇటీవల ఆమోదించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టింది. తాజాగా నూతన టీఎస్పీఎస్సీ చైర్మన్‌ గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి నియామకం అయ్యారు. త్వరలో సభ్యులనుసైతం ప్రభుత్వం నియమించనుంది.

ANN TOP 10