కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒకటి. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల (ఫిబ్రవరి) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని వంద రోజుల్లో తప్పక నెరవేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. హామీలపై వెనక్కి తగ్గమని, ఇందులో ఎలాంటి సందేహలు అక్కరలేదన్నారు.
గత ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, ఈ కారణంగానే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి జైలుకి పోవడం ఖాయమన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ ఉంటుందన్నారు.









